సిబిఐ ఫై సన్నగిల్లుతున్న విశ్వాసం

December 22
11:56 2017

ఆరేడేళ్లుగా సాగుతున్న 2జీ కుంభకోణం కేసులో ప్రధాన నిందితులుగా పేర్కొన్న వారిలో అత్యంత ప్రముఖులైన డీఎంకే అధినేత కుమార్తె కనిమొళి.. మాజీ కేంద్ర టెలికాం మంత్రి రాజాలు సుద్దపూసలుగా తేల్చేసింది. వారిపై వచ్చిన ఆరోపణల్ని నిరూపించే విషయంలో ఫెయిల్ కావటంతో సీబీఐ ప్రత్యేక కోర్టు వీరిద్దరిని నిర్దోషులుగా తేల్చేసింది. ఈ తీర్పుపై పెద్ద ఎత్తున భిన్నాభిప్రాయాలు వెల్లువెత్తుతున్నాయి.ఇదిలా ఉంటే.. తాజా తీర్పు కాంగ్రెస్ పార్టీకి కొండంత బలంగా మారింది. తీర్పు వెలువడిన వెంటనే స్పందించిన మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ తన ప్రభుత్వ హయాంలో ఏమీ జరగలేదని.. కుట్రపూరితంగా తప్పుడు ఆరోపణలు చేసి తమ ఇమేజ్ను డ్యామేజ్ చేసినట్లుగా విమర్శించారు.ఏం జరిగినా పెద్దగా రియాక్ట్ కాని మన్మోహన్ సింగ్ అంతలా స్పందించిన తర్వాత మిగిలిన వారు మాట్లాడకుండా ఉంటారా? అందుకే.. ఎవరికి వారు స్పందిస్తున్నారు.

ఇదిలా ఉంటే.. కాంగ్రెస్ పార్టీ ఆసక్తికరమైన వాదనను తెర మీదకు తెచ్చింది. 2జీ కుంభకోణం కేసులో సీబీఐ కోర్టు ఇచ్చిన తీర్పు నేపథ్యంలో.. ఈ వ్యవహారానికి అసలు కారణమైన మాజీ కంప్ట్రోలర్ ఆడిటర్ జనరల్ వినోద్ రాయ్ పై తీవ్రస్థాయిలో విరుచుకుపడింది. ఆయన తీరు కాగ్ చరిత్రలో మచ్చగా మారుతుందని కాంగ్రెస్ మండిపడుతోంది.వినోద్ రాయ్ చేసిన పనికి మాజీ కాగ్ అధినేత ఏ స్థాయిలో ప్రతిఫలం పొందుతున్నారో ఇప్పుడు అందరూ చూస్తున్నారని.. ఆయన మోడీ ప్రభుత్వానికి బలమైన సలహాదారుగా వ్యవహరిస్తున్నట్లు ఆరోపించారు. వినోద్ రాయ్ తీరు కాగ్ చరిత్రలో మచ్చగా మారుతుందని.. ఆయన్ను దర్యాప్తు సంస్థలు వెంటనే ప్రాసిక్యూట్ చేయాలని డిమాండ్ చేశారు.2జీ స్కాంతో దేశ ఖజానాకు రూ.1.78 లక్షల కోట్లు నష్టం వాటిల్లినట్లుగా ఆయన పేర్కొనటంతో పెద్ద దుమారం రేగటం తెలిసిందే. 2జీ స్కాం మీద ఎప్పుడూ డిఫెన్స్ లో పడే కాంగ్రెస్ తాజగా సీబీఐ కోర్టు తీర్పుతో గొంతు తీవ్రం కావటమే కాదు.. కొత్త శక్తితో మండిపడుతోంది. మొత్తంగా చూస్తే.. కాంగ్రెస్ చేతికి సీబీఐ తీర్పు భారీ తుపాకీగా మారిందన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. ప్రభుత్వ ఆధ్వర్యంలోని నేరవిచారణ – దర్యాప్తు సంస్థలు కొన్ని సందర్భాలలో ఆయా ప్రభుత్వాల భావజాలానికి – ఆదేశాలకు అనుగుణంగా నడుచుకుంటూ ఉండడం జరుగుతుంది. ప్రతిసారీ అవి నికార్సుగా వ్యవహరిస్తాయని అనుకోవడానికి వీల్లేదు. రాజకీయ ప్రేరేపిత విచారణలు కూడా అనేకం సంభవిస్తూ ఉంటాయి. ఇప్పుడు 2జీ కుంభకోణం విషయంలో కూడా అలాంటి అనుమానాలే ప్రజల్లో కలుగుతున్నాయి.

కాకపోతే కాంగ్రెసు హయాంలో జరిగిన అవినీతి గురించి… ఆ ప్రభుత్వ హయాంలోనే విచారణ కూడా ప్రారంభం అయింది. నిజానికి 2జీ స్పెక్ట్రం కేటాయింపులను సుప్రీం కోర్టు ఎన్నడో రద్దు చేసేసింది గానీ.. నేరానికి సంబంధించిన విచారణ మాత్రం ఇన్నాళ్లు సాగింది. ఇవాళ అందరూ నిర్దోషులని తేలింది.అయితే.. సీబీఐ సరైన సాక్ష్యాధారాలు సమర్పించలేకపోయినందున.. అందరినీ నిర్దోషులుగా పరిగణిస్తున్నట్లుగా కోర్టు ప్రకటించడం ఇక్కడ కీలకాంశం. అంటే సీబీఐ రాజకీయ ప్రేరేపితంగానే సాక్ష్యాలను సేకరించలేకపోయినా అనే అనుమానం ఎవరికైనా కలిగితే ఆశ్చర్యం ఏముంది.ఇలాంటి నేపథ్యంలో జగన్ మీద ఉన్న ఆరోపణల విషయాలు కూడా జనంలో ప్రస్తావనకు వస్తున్నాయి. వైఎస్ జగన్ గురించి కోట్లకు కోట్ల రూపాయల అక్రమాలు జరిగిపోయినట్లు ఆరోపణలు గుప్పించిన సీబీఐ – ఇన్ని సంవత్సరాలుగా న్యాయస్థానంలో విచారణ జరుగుతూ ఉంటే.. ఇప్పటిదాకా ఒక్కటంటే ఒక్కటైనా ఆరోపణలు నిరూపించే సరైన సాక్ష్యాధారాలను సమర్పించకపోవడం గమనార్హం.సీబీఐ వ్యవహరించే తీరు ఎలా ఉంటుందో అనడానికి ఇదే నిదర్శనం అని పలువురు అంటున్నారు. సాక్ష్యాలను సేకరించడమూ – నేరాన్ని నిరూపించడమూ ఇవన్నీ తర్వాతి సంగతులు.. ముందుగా ఆరోపణల బురద చల్లేసి.. అరెస్టు చేసి జైల్లో పెట్టించేసి.. రాజకీయంగా బద్నాం చేసి.. రాజకీయంగా తామంటే కిట్టని వారిని బలిపశువుల్ని చేయడానికి సీబీఐ అధికార పార్టీలకు ఒక ఉపకరణం లాగా ఉపయోగపడుతూ ఉంటుందనడానికి ఇది ఒక తాజా నిదర్శనం మాత్రమే అని కూడా ప్రజల్లో విమర్శలు వినిపిస్తున్నాయి. వైఎస్ జగన్ మీది ఆరోపణల విషయంలోనూ అసలు అక్రమాలే లేవని అంతకు మించి ఆధారాలూ లేవని – ఇక సీబీఐ ఆ కేసు విషయంలో కూడా ఏదో ఒక రోజు చేతులెత్తేయాల్సిందే అని కూడా అప్పుడే వ్యాఖ్యానాలు వినిపిస్తున్నాయి.సాధారణంగా కోర్టు తీర్పుల గురించి విమర్శలు చేయాలన్నా… వాటికి దురుద్దేశాలను ఆపాదించాలన్నా అందరూ చాలా ఆచితూచి వ్యవహరిస్తూ ఉంటారు. మీడియాలో కూడా ఎవరికితోచిన రాతల్ని విమర్శల్ని నాయకుల మీద అధికార్ల మీద అయితే ఎడాపెడా నర్మగర్భ అలంకారాలువేసి రాసేస్తారు గానీ.. కోర్టు తీర్పుల జోలికి మాత్రం వెళ్లరు. ఎందుకంటే.. కోర్టు తీర్పుల గురించి ఎలాంటి తప్పుడు వ్యాఖ్యాలు దొర్లినా సరే.. కోర్టు తనంతగా స్పందించి శిక్ష విధించేయడానికి కూడా అవకాశం ఉంటుంది. అందుకే అలాంటి జాగ్రత్తలు తీసుకుంటూ ఉంటారు. కానీ సోషల్ మీడియా వచ్చిన తర్వాత.. వాటికి మినహాయింపు లేకుండాపోయింది. తమకు తీర్పు నచ్చకపోతే.. ఎవరికి తోచిన వ్యాఖ్యలు వారు గుప్పించేస్తున్నారు.తాజాగా 2జీ స్కామ్ లో కనిమొళి – రాజా సహా మొత్తం నిందితులు అందరినీ నిర్దోషులుగా ప్రకటిస్తూ వచ్చిన తీర్పు మీద సోషల్ మీడియా మొత్తం భగ్గు మంటోంది.

అందరూ ఎడాపెడా దీనిపై జోకులు వేస్తున్నారు.2జీ స్కామ్ కూడా నిజం కాదని తేలిపోతే గనుక.. అసలు దేశాన్ని పరిపాలించే అధికారమే కాంగ్రెస్ చేతిలో ఉండాల్సిందని దాన్ని అడ్డుపెట్టుకునే అవినీతి ముద్ర వేసి మోడీ గద్దె ఎక్కడాని కొందరు ఆడిపోసుకుంటూ ఉంటే.. నరేంద్రమోడీ.. భవిష్యత్తులో తమిళనాడు విషయంలో అన్నా డీఎంకే ను కాకుండా .. డీఎంకేను ఎన్డీయేలో కలుపుకునే మూడ్ లో ఉన్నారనడానికి నిదర్శనమే ఈ కోర్టు తీర్పు అని కొందరు వ్యాఖ్యానిస్తున్నారు.2015 జనవరిలో కేంద్ర ఆర్థిక మంత్రి వచ్చి పురట్చితలైవి అమ్మను కలిశారని.. ఆ వెనుకనే.. కర్ణాటక హైకోర్టు.. జయలలిత మీద కేసులు కొట్టివేసిందని 2017 నవంబరులో మోడీ వచ్చి కరుణానిదిని కలిసి వెళ్లగానే.. మొత్తం 2జీ నిందితులంతా నిర్దోషులుగా బయటపడిపోయారని మరికొన్ని జోకులు పేలుతున్నాయి.ప్రధాని నరేంద్రమోడీ తలచుకుంటే.. ఎందరు నిందితులు అయినా ఇలా బయటపడిపోగలరని సెటైర్లు వేస్తున్న వారు కొందరు. అయినా.. ఇలా కోర్టు తీర్పునకు ఉద్దేశ్యాలను ఆపాదిస్తూ కామెంట్లు చేయడం తగదు గానీ.. సోషల్ మీడియాలో ఇలాంటివి నియంత్రణ లేకుండా చక్కర్లు కొడుతుండడం విశేషం.   కాంగ్రెస్ సారథ్యంలోని యూపీఏ హయాంలో జరిగిన అతిపెద్ద కుంభకోణాల్లో 2జీ స్పెక్ట్రమ్ స్కామ్ కూడా ఒకటి. ఈ స్కామ్ విలువ ఏకంగా రూ.లక్షా 76 వేల కోట్లు. 2008 నాటిదీ స్కామ్. ఇందులో ప్రధాన నిందితులు అప్పటి కేంద్ర సమాచార శాఖ మంత్రి ఎ.రాజా – డీఎంకే అధినేత కరుణానిధి కూతురు కనిమొళి. 2జీ స్పెక్ట్రమ్ లైసెన్సుల జారీలో కొన్ని చట్టాలను ఉల్లంఘించారని – భారీగా ముడుపులు చేతులు మారినట్లు ఆరోపణలు ఉన్నాయి. అసలు అర్హత లేని – టెలికాం రంగంలో అనుభవం లేని యూనిటెక్ అండ్ స్వాన్ టెలికామ్ కంపెనీకి లేదా ముందుగానే దీనికి సంబంధించిన సమాచారం ఉన్న కంపెనీలకు అక్రమంగా లైసెన్సులు కట్టబెట్టినట్లు కాగ్ నివేదిక వెల్లడించింది.కాగ్ నివేదిక ప్రకారం 2జీ స్పెక్ట్రం కేటాయింపులపై మొత్తం మూడు కేసులు నమోదయ్యాయి. ఇందులో రెండు సీబీఐ నమోదు చేయగా.. మూడోది ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) నమోదు చేసింది.

ఆరేండ్ల కిందట సీబీఐ మొదటి చార్జిషీట్ దాఖలు చేయడంతో ఈ కేసు విచారణ ప్రారంభమైంది. మొదటి కేసులో రాజా – కనిమొళితోపాటు నాటి టెలికంశాఖ కార్యదర్శి సిద్ధార్థ బెహుర – రాజా ప్రైవేటు సెక్రటరీ ఆర్కే చందోలియా – స్వాన్ టెలికాం ప్రమోటర్స్ షాహిద్ ఉస్మాన్ బల్వా – వినోద్ గోయెంకా – యునీటెక్ లిమిటెడ్ ఎండీ సంజీవ్ చంద్ర – ఆర్ ఏడీఏజీకు చెందిన గౌతమ్ దోషి – సురేంద్ర పిపర – హరి నాయర్ – కుసెగావ్ ఫ్రూట్స్ అండ్ వెజిటెబుల్స్ ప్రైవేట్ లిమిటెడ్ డైరెక్టర్ ఆసిఫ్ బల్వా – రాజీవ్ అగర్వాల్ – కలైంజ్ఞర్ టీవీ డైరెక్టర్ శరత్ కుమార్ – బాలీవుడ్ నిర్మాత కరీం మొరానీ నిందితులుగా ఉన్నారు. ఈ 14 మంది వ్యక్తులతోపాటు స్వాన్ టెలికాం ప్రైవేట్ లిమిటెడ్(ఎస్టీపీఎల్) – రిలయన్స్ టెలికమ్ లిమిటెడ్ – యునీటెక్ వైర్ లెస్ (తమిళనాడు) లిమిటెడ్ కంపెనీలపై సీబీఐ అభియోగాలు మోపింది. 122 లైసెన్సులను ఇవ్వడం ద్వారా రూ.30984 కోట్ల నష్టం వాటిల్లినట్టు సీబీఐ చార్జిషీట్ లో తెలిపింది. అనంతరం ఆర్ ఏడీఏజీ చైర్మన్ అనిల్ అంబానీ – ఆయన సతీమణి టీనా అంబానీ – కార్పొరెట్ లాబీయిస్ట్ నీరా రాడియాతోపాటు 154 మంది సాక్షుల వాంగ్మూలాలను సుప్రీంకోర్టు రికార్డు చేసింది. ఈ కేసులో నిందితులకు కోర్టు ఆరు నెలల నుంచి జీవితఖైదు విధించే అవకాశాలు ఉన్నాయి.సీబీఐ రెండో కేసులో.. ఎస్సార్ గ్రూప్ ప్రమోటర్లు రవి రూయా – అన్షుమన్ రూయా – లూప్ టెలికమ్ ప్రమోటర్లు కిరణ్ ఖైతాన్ – ఆమె భర్త ఐపీ ఖైతాన్ – ఎస్సార్ గ్రూప్ డైరెక్టర్ (స్ట్రాటజీ అండ్ ప్లానింగ్) వికాస్ సరఫ్ తోపాటు లూప్ టెలికం లిమిటెడ్ – లూప్ మొబైల్ ఇండియా లిమిటెడ్ – ఎస్సార్ టెలీహోల్డింగ్ లిమిటెడ్ (ఈటీహెచ్ ఎల్) కంపెనీలను నిందితుల జాబితాలో చేర్చారు. మూడో కేసు విషయానికి వస్తే.. ఏప్రిల్ 2014న 19 మందిపై ఈడీ చార్జిషీట్ నమోదు చేసింది. డీఎంకే పార్టీకి చెందిన కలైంజ్ఞర్ టీవీలో ఎస్టీపీఎల్ కంపెనీ రూ.200 కోట్ల పెట్టుబడులు పెట్టిన కేసులో డీఎంకే అధినేత కరుణానిధి భార్య దయాళు అమ్మాళ్ పేరును ఈడీ చార్జిషీట్ లో చేర్చింది. మనీలాండరింగ్ ప్రివెన్షన్ యాక్టు కింద ఈడీ తన తుది నివేదికలో మొత్తం 10మంది వ్యక్తులను – 9 కంపెనీలను నిందితుల జాబితాలో చేర్చింది. దేశం మొత్తం కిందామీదా పడిపోయింది. జనాలైతే బుగ్గలు నొక్కుకున్నారు. హవ్వ..హవ్వ.. మరీ ఇంత అన్యాయమా? మరీ.. ఇంత దారుణమా? మరీ.. ఇంత బరితెగింపా? అని ఎవరికి వారు తెగ ఫీలయ్యారు. ఇదంతా ఎందుకంటే.. సహజ వనరుల్ని అధికారపక్షం ఎంత దారుణంగా వాడుకుంటుందో తెలిసి గుండెలు బాదేసుకున్నారు. కాగ్ లెక్కల ప్రకారమైతే ఏకంగా లక్షన్నర కోట్ల రూపాయిల ప్రజా సొమ్ము. తర్వాతి దశల్లో ఇది కాస్తా ముప్ఫై వేల కోట్ల చిల్లరగా లెక్క తేల్చారు.ఈ భారీ స్కాం మీద ఎన్ని వందల టన్నుల న్యూస్ ప్రింట్ వృధా అయ్యిందో లెక్క తీయటం కూడా కష్టమే. ఇక.. ఎన్ని కోట్ల గంటలు టీవీల్లో చర్చల రూపంలో ఖర్చు అయ్యాయో.. ఈ స్కాం మీద కోట్లాది మంది అదే పనిగా మాట్లాడుకోవటం.. స్పందించటం.. వ్యాసాలు రాయటం.. ఇలా చెప్పుకుంటూ పోతే.. చాలానే చర్చ జరిగింది.అందుకు మించిన రచ్చ జరిగింది. ఈ స్కాం బయటకొచ్చి దాదాపు ఆరేడేళ్లు అయ్యింది.  యూపీఏ ప్రభుత్వం మీద భారీ మచ్చ పడేలా చేసింది.

మన్మోహన్ సింగ్ పాలనకు ముగింపు పలకలంలో 2జీ స్కాం ఎంత కీలకమైందో తెలియంది కాదు.  2జీ స్కాం మీద ఒకలాంటి ఉద్యమమే చేశారు బీజేపీ సీనియర్ నేత సుబ్రమణ్య స్వామి.  ఈ వ్యవహారాన్ని తెర మీదకు తీసుకొచ్చింది.. యూపీఏ సర్కారు ఇమేజ్ ను భారీగా డ్యామేజ్ చేయటాన్ని మర్చిపోకూడదు.మరి.. ఈ రోజు ఏమైంది..? స్కాంలో ఆరోపణలు వెల్లువెత్తి.. జైల్లో కొంత కాలం గడిపి నిందితులన్న ముద్ర పడిన మాజీ కేంద్రమంత్రి రాజా.. కరుణానిధి కుమార్తె కనిమొళి ఇద్దరూ సుద్దపూసలు మాదిరి బయటకు వచ్చారు. ఆసక్తికరమైన విషయం ఏమిటంటే.. యూపీఏకు మిత్రపక్షంగా కేంద్రంలో అధికారంలో ఉండి కూడా తమ పార్టీకి చెందిన కేంద్రమంత్రి పదవి కోల్పోయి జైల్లోకి వెళ్లటం ఒక ఎత్తు అయితే.. డీఎంకే అధినేత కుమార్తె కనిమొళి కూడా ఈ కేసులో భాగంగా జైలుపాలు కావాల్సి వచ్చింది.

సొంత ప్రభుత్వం హయాంలో జైల్లోకి వెళ్లి వచ్చిన వీరు.. ఇప్పుడు కేంద్రంలో మోడీ సర్కారు పవర్లో ఉన్న వేళ.. నిర్దోషులుగా విడుదల కావటం ఆసక్తికరంగా మారింది.అమ్మ జయలలిత ప్రాతినిధ్యం వహించిన ఆర్కేనగర్ స్థానానికి ఉప ఎన్నికల్లో  కీలకమైన పోలింగ్ వేళ తీర్పు రావటం డీఎంకే వర్గాలు ఫుల్ ఖుష్ అయ్యాయి. ఒకరకంగా చూస్తే వాళ్లకు డబుల్ థమాకా. కోర్టు తీర్పు పాజిటివ్ గా మారి.. ఓటర్ల మీద ఎంతోకొంత ప్రభావం చూపుతుందనటంలో సందేహం లేదు. సో.. డీఎంకే వారంతా హ్యాపీ.ఇన్నేళ్లుగా సాగుతున్న తీర్పును ఎలాంటి ప్రభావాలు లేకుండా చేయగలిగామన్న తృప్తితో మోడీ సర్కార్ హ్యాపీ కావొచ్చు. ఎన్నో వేల ప్రతుల్ని పరిశీలించి.. న్యాయాన్ని.. ధర్మాన్ని తూచా తప్పకుండా కేసు తీర్పు ఇచ్చినందుకు కోర్టుకు.. ఒక కేసు భారం తగ్గిపోయిందన్న హ్యాపీ ఉండొచ్చు. ఇక.. అరిగిపోయిన టేపు మాదిరి అదే పనిగా 2జీ.. 2జీ అంటూ ఇప్పుడా కేసును వదిలేసి.. కొత్త కేసుల మీద ఫోకస్ చేసుకోవచ్చు.

ఆందుకు మీడియా కూడా హ్యాపీ. ఇలా ఎవరికి వారికి.. అవసరమైన హ్యాపీ అంతా దొరికిపోయినట్లే.కాకుంటే.. ఇబ్బంది అంతా అమాయకపు పిచ్చ జనాలదే.  స్కాం బయటకు రాగానే ఆవేశంతో చొక్కాలు చించుకొని.. గుండెలు బాదేసుకున్న వారికి. ప్రజాధనాన్ని దోచేసుకునే వారికి జైలుశిక్ష తప్పదని అనవసరమైన భ్రాంతులకు గురైన వారికే అసలు ఇబ్బందంతా.  ప్రజాస్వామ్య భారతంలో సగటుజీవికి.. ఏదో శశికళ లాంటి కొందరి విషయంలోనే.. చట్టం తన పని తాను చేసుకుంటూపోయేది.

 

Related Articles

తాజా వార్తలు

Free Live TV

షేర్ మార్కేట్

Live NSE BSE Market Charts
'