నెట్ న్యూట్రాలిటీకి అమెరికా గుడ్ బై..

December 15
13:28 2017

 

వాషింగ్టన్‌ః ఇంటర్నెట్‌లో భేదాలు లేవు.. అందరూ సమానమే.. ఇదే నెట్ న్యూట్రాలిటీ. కానీ అమెరికా దీనికి గుడ్ బై చెప్పేసింది. 2015లో ఒబామా ప్రభుత్వం తీసుకొచ్చిన నిబంధనలను రద్దు చేసింది. అమెరికా ఫెడరల్ కమ్యూనికేషన్స్ కమిషన్ (ఎఫ్‌సీసీ) నెట్ న్యూట్రాలిటీకి వ్యతిరేకంగా ఓటేసింది. అమెరికా తీసుకున్న ఈ నిర్ణయం ఇండియాలాంటి పలు దేశాలపై కూడా ప్రభావం చూపనున్నది. ఇండియన్ అమెరికన్, ట్రంప్‌కు సన్నిహితుడైన ఎఫ్‌సీసీ చైర్మన్ అజిత్ పాయ్ ఈ సంచలన నిర్ణ‌యం తీసుకున్నారు. అమెరికాలోని ఏటీఅండ్‌టీ, కామ్‌కాస్ట్, వెరిజాన్‌లాంటి ఇంటర్నెట్ సర్వీస్ ప్రొవైడర్ల(ఐఎస్‌పీ)కు దక్కిన ఘన విజయంగా దీనిని అభివర్ణిస్తున్నారు. దీనివల్ల నెట్ వినియోగదారులు ఎలాంటి కాంటెంట్‌ను చూడాలన్నది ఇక ఈ ఐఎస్‌పీల చేతుల్లో ఉంటుంది. నెట్ న్యూట్రాలిటీ వద్దని ఐఎస్‌పీలు, కావాలని కాంటెంట్ ప్రొవైడర్లు వాదిస్తున్నారు. ఇప్పుడు ఎఫ్‌సీసీ నెట్ న్యూట్రాలిటీకి మంగళం పాడటంతో వాళ్ల నిర్ణ‌యంపై న్యాయపోరాటానికి కాంటెంట్ ప్రొవైడర్లు సిద్ధమవుతున్నారు.

అసలేంటీ నెట్ న్యూట్రాలిటీ?
నెట్ న్యూట్రాలిటీ అంటే అందరు కాంటెంట్ ప్రొవైడర్లకు సమానమైన నెట్ హక్కులు ఉండటం. 2015లో ఒబామా ప్రభుత్వం దీనికి ఓకే చెప్పింది. దీనివల్ల ఇంటర్నెట్ సర్వీస్ ప్రొవైడర్లు కావాలని కొన్ని సైట్లను స్లో చేయడం, బ్లాక్ చేయడం లేదా కొన్ని సైట్ల స్పీడు పెంచడంలాంటివి చేయకుండా ఈ నిబంధనలు అడ్డుకుంటున్నాయి. అన్ని వెబ్‌సైట్లకు సమానమైన నెట్ యాక్సెస్ ఉండాలన్నది నెట్ న్యూట్రాలిటీ ఉద్దేశం. దీనివల్ల ఒకరు డబ్బులు ఎక్కువగా ఇచ్చారు కదా అని ఆ వెబ్‌సైట్‌కు పోటీగా వస్తున్న వెబ్‌సైట్ల వేగాన్ని ఎలా పడితే అలా తగ్గించే వీలు ఇంటర్నెట్ సర్వీస్ ప్రొవైడర్లకు ఉండదు. అయితే ఐఎస్‌పీలు మాత్రం తాము అలా వేగాన్ని తగ్గించడంగానీ, బ్లాక్ చేయడంగానీ చేయబోమని.. కాకపోతే డబ్బు చెల్లించేదానిని బట్టి వేగాన్ని పెంచడం చేస్తామని వాదిస్తూ వస్తున్నారు.

దీనివల్ల నష్టం ఏంటి?
అటు ఎఫ్‌సీసీ చైర్మన్ అజిత్ పాయ్ మాట్లాడుతూ.. నెట్ న్యూట్రాలిటీ అనేది లేని సమస్యను పరిష్కరిస్తామన్నట్లుగా ఉందని అభిప్రాయపడ్డారు. ఎఫ్‌సీసీ తీసుకున్న ఈ నిర్ణయం నేరుగా కాకపోయినా.. ఇండియాలాంటి ఇతర దేశాలపైనా ఉంటుందని నిపుణులు చెబుతున్నారు. నెట్ న్యూట్రాలిటీని ఎత్తేయడం వల్ల ఫేస్‌బుక్, యూట్యూబ్‌లాంటి పెద్ద సంస్థలకు పోటీగా ఉన్న విమియో, రెడిట్‌లాంటి వెబ్‌సైట్లకు తీవ్ర నష్టం వాటిల్లుతుంది. తమకు పోటీగా రాకుండా ఉండేందుకు ఇంటర్నెట్ సర్వీస్ ప్రొవైడర్లకు ఎంతైనా చెల్లించడానికి పెద్ద సంస్థలు సిద్ధంగా ఉంటాయి. దీంతో వీళ్ల వెబ్‌సైట్ల వేగం పెరిగి.. వీళ్లకు పోటీగా ఎదుగుతున్నవి కనుమరుగైపోయే ప్రమాదం కూడా ఉంటుంది. అమెరికాలో ఇలాంటి చిన్నాచితకా వెబ్‌సైట్లు అడ్రెస్ లేకుండా పోవడం వల్ల ఆ వెబ్‌సైట్లను వాడే ఇండియాలాంటి దేశాల్లోని యూజర్లపై కూడా ప్రభావం పడుతుంది. అయితే ఇంటర్నెట్ విషయంలో తాము ఎలాంటి వివక్ష చూపబోమని గత నెలలోనే మన ట్రాయ్ ప్రకటించడం కాస్తు ఊరట కలిగించే విషయం.

 

Tags
Share

Related Articles

తాజా వార్తలు

Free Live TV

షేర్ మార్కేట్

Live NSE BSE Market Charts
'