గుజరాత్‌లో బిజెపి ఘన విజయం

December 18
06:32 2017

గాంధీ;గుజ‌రాత్ అసెంబ్లీ ఎన్నిక‌ల ఓట్ల‌ లెక్కింపు ముగిసింది. ప్ర‌భుత్వ ఏర్పాటుకు కావాల్సిన 92 స్థానాల్ని భార‌తీయ జ‌నతా పార్టీ ఇప్ప‌టికే సాధించిన విష‌యం తెలిసిందే. గుజరాత్‌లో బీజేపీ మొత్తం 99 స్థానాలు గెలుపొందింది. కాంగ్రెస్ కూట‌మి 80 స్థానాల‌ను గెలుపొందింది. ఇక ఇత‌రులు 3 స్థానాల్లో విజ‌యం పొందారు. ఒకటి కాదు రెండు కాదు వరుసగా ఆరోసారి భాజపా అధికార పీఠాన్ని కైవసం చేసుకుంది. దీంతో పశ్చిమ్‌బంగాలో వామపక్ష కూటమి నెలకొల్పిన రికార్డుకు భాజపా అడుగు దూరంలో నిలిచింది.ఇప్పుడు గుజరాత్‌ కూడా బంగాల్‌ బాటలోనే ఉంది. ఇక్కడ భారతీయ జనతా పార్టీ వరుసగా ఆరోసారి జయకేతనం ఎగురవేసింది. ఇప్పటికే 22ఏళ్ల పాటు అధికార పీఠంలో కొనసాగుతున్న భాజపా.. మరో ఐదేళ్ల పాటు  పాలించనుంది.
1995లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో భాజపా తొలిసారిగా విజయం సాధించింది. ఆ ఎన్నికల్లో భాజపాకు 121 సీట్లు వచ్చాయి. ఇక అప్పటి నుంచి రాష్ట్రంలో భాజపా జయభేరీ మోగుతూనే ఉంది. ఆ తర్వాత మూడేళ్లకు 1998లో జరిగిన మధ్యంతర ఎన్నికల్లో భాజపా 117 స్థానాలు దక్కించుకుని రెండో సారి అధికారాన్ని కైవసం చేసుకుంది. కేశూభాయ్‌ పటేల్‌ ముఖ్యమంత్రిగా నియమితులయ్యారు. అయితే కచ్‌ భూకంపం అనంతరం సహాయకచర్యలు చేపట్టడంపై అలసత్వం ప్రదర్శించారన్న ఆరోపణలు రావడంతో నరేంద్రమోదీ సీఎంగా బాధ్యతలు చేపట్టారు.

ఇక గోద్రా అల్లర్ల నేపథ్యంలో 2002లో ముందస్తు అసెంబ్లీ ఎన్నికలు నిర్వహించారు. ఆ ఎన్నికల్లోనూ భాజపా 127 స్థానాలతో ఘనవిజయం సాధించింది. నరేంద్రమోదీ మళ్లీ ముఖ్యమంత్రిగా ఎన్నికయ్యారు. 2007లో జ‌రిగిన అసెంబ్లీ ఎన్నిక‌ల్లోనూ న‌రేంద్ర‌మోదీ నేతృత్వంలోని భాజ‌పా విజ‌య దుంధుబి మోగించింది. ఆ ఎన్నిక‌ల్లో భాజ‌పా 117 స్థానాలు సాధించ‌గా, కాంగ్రెస్ 59 స్థానాల‌కే ప‌రిమిత‌మైంది. ఆ తర్వాత ఐదేళ్లకు 2012లో జరిగిన శాసనసభ ఎన్నికల్లోనూ భాజపా గెలుపొందింది. ఆ ఎన్నికల్లో భాజపాకు 116 సీట్లు వచ్చాయి.

తాజాగా జరిగిన ఎన్నికల్లోనూ భాజపా జయకేతనం ఎగురవేసి.. వరుసగా ఆరోసారి అధికారాన్ని నిలబెట్టుకుంది. వచ్చే ఎన్నికల్లోనూ భాజపా గెలుపొందితే.. బెంగాల్‌లో వామపక్ష కూటమి నెలకొల్పిన రికార్డును సమం చేసినట్లవుతుంది.

Related Articles

తాజా వార్తలు

Free Live TV

షేర్ మార్కేట్

Live NSE BSE Market Charts
'