సుపరిపాలనకు ప్రజలు పట్టం కట్టారు

December 18
10:21 2017

న్యూదిల్లీ: గుజరాత్‌, హిమాచల్‌ప్రదేశ్‌ అసెంబ్లీ ఎన్నికల్లో భాజపా విజయం సాధించడంపై ప్రధాని నరేంద్రమోదీ హర్షం వ్యక్తం చేశారు. అభివృద్ధి, సుపరిపాలనకు ప్రజలు పట్టం కట్టారని పేర్కొన్నారు. భాజపా గెలుపు కోసం ఆయా రాష్ట్రాల్లో ఎంతో శ్రమించిన భాజపా కార్యకర్తలకు అభినందనలు తెలిపారు. గుజరాత్‌, హిమాచల్‌ప్రదేశ్‌ ప్రజలు భాజపాపై ఎంతో నమ్మకముంచి ఓట్లేసి గెలిపించారని మోదీ అన్నారు. రెండు రాష్ట్రాల్లోని ప్రజల సంక్షేమానికి ఎల్లప్పుడూ కట్టుబడి ఉంటామని హామీ ఇచ్చారు. హిమాచల్ ప్రదేశ్‌లో కమలం వికసించిందని, అభివృద్ధికి ఘన విజయం లభించిందని పేర్కొన్నారు. గుజరాత్‌ గురించి ఇచ్చిన ట్వీట్‌లో అభివృద్ధి గెలిచింది, గుజరాత్ గెలిచింది అని పేర్కొన్నారు.

ఈ ఎన్నికల ఫలితాలు సుపరిపాలన, అభివృద్ధి రాజకీయాలకు బలమైన మద్దతును తెలియజేస్తున్నాయని మరో ట్వీట్‌లో పేర్కొన్నారు. ఈ రాష్ట్రాల్లోని బీజేపీ కార్యకర్తలకు వందనం చేస్తున్నట్లు పేర్కొన్నారు. వారి కృషి వల్లే ఈ ఘన విజయాలు సాధ్యమయ్యాయని తెలిపారు. బీజేపీపై ప్రేమాభిమానాలను, నమ్మకాన్ని చూపించిన గుజరాత్, హిమాచల్ ప్రదేశ్ ప్రజలకు శిరసు వంచి నమస్కరిస్తున్నట్లు తెలిపారు. అభివృద్ధిని ముందుకు తీసుకెళ్ళడానికి ఉండే ఏ అవకాశాన్నీ వదిలిపెట్టబోమని హామీ ఇస్తున్నట్లు తెలిపారు. అలసట లేకుండా ప్రజలకు సేవ చేస్తామని హామీ ఇచ్చారు

Related Articles

తాజా వార్తలు

Free Live TV

షేర్ మార్కేట్

Live NSE BSE Market Charts
'