డిజిటల్ మాధ్యమాలలో తెలుగు వాడుక

December 17
19:28 2017

హైదరాబాద్ : డిజిటల్ మాధ్యమాలలో తెలుగు వాడుకను పెంచడానికి, సులభతరం చేయడానికి వ్యక్తిగతంగా, సంస్థాగతంగా జరుగుతున్న ప్రయత్నాలను ఒకే వేదికపైకి తీసుకువచ్చి సంఘటితంగా, సమిష్టి కృషి జరగాలని, ఆ దిశగా సాగేందుకు తెలంగాణ ప్రభుత్వం సంపూర్ణ సహకారం ఉంటుందని ఐటీ శాఖ ముఖ్య కార్యదర్శి  జయేష్ రంజన్ అన్నారు. ప్రపంచ తెలుగు మహాసభల నేపథ్యంలో ఐటీ శాఖకు చెందిన డిజిటల్ మీడియా విభాగం నిర్వహించిన చర్చా గోష్టి – ‘డిజిటల్ తెలుగు – డిజిటల్ మాధ్యమాలలో తెలుగు వాడుక మరియు అభివృద్ధి’లో పాల్గొని వారు స్వాగతోపన్యాసం చేశారు.ఐసిఏఎన్ఎన్ కొత్తగా 100 కోట్లమందికి అంతర్జాలాన్ని చేరవేయాలని లక్ష్యంగా పెట్టుకున్నదని, ఇందుకోసం అంతర్జాలంలో స్థానికీకరణ ప్రయత్నాలు చాలా ప్రాముఖ్యత సంతరించుకోనున్నవని అభిప్రాయపడ్డారు.

ఈ దిశగా ఇప్పటికే కొన్ని వెబ్ సైట్లను పూర్తిగా యూనికోడ్ ఖతులను ఉపయోగించి రూపొందించామని చెప్పారు. చర్చా గోష్టిని పురస్కరించుకొని డిజిటల్ మాధ్యమాలలో తెలుగును వాడటానికి ఉపయోగపడే పనిముట్లను, అప్లికేషన్స్, ఖతులు, ఇతరత్రా సాధనాలను ఒక్క చోట చేర్చిన వెబ్ పేజ్ (http://it.telangana.gov.in/digitaltelugu/) డిజిటల్ మీడియా సంచాలకులతో కలిసి వారు ఆవిష్కరించారు.‘డిజిటల్ తెలుగు’ చర్చా గోష్టి స్థూలంగా నాలుగు అంశాలపై జరిగింది 1. డిజిటల్ తెలుగు – పరిణామ క్రమం, నేటి వరకు జరిగిన కృషి 2. బ్లాగులు, పత్రికలూ, వికిపీడియా, ఈ-కామర్స్ వంటి అన్-లైన్ వేదికలపై తెలుగు వాడకం 3. పదాలను శబ్దంగా మార్చే ప్రక్రియ (టెక్స్ట్ నుండి స్పీచ్), స్థానీకరణ  4. డిజిటల్ తెలుగు వాడుకను పెంపొందించే క్రమంలో ప్రభుత్వం, వ్యక్తులు, ఇతర సంస్థలు ఇకపై చేయవలసిన కృషి.ఈ సందర్బంగా వచ్చిన సూచనలను ఐటీ శాఖ సూత్రప్రాయంగా అంగీకరించింది.

*ప్రపంచ అంతర్జాల సదస్సు ప్రతి రెండేళ్లకొకసారి నిర్వహించడం

*డిజిటల్ తెలుగు రంగంలో ఉపకరణాలను అభివృద్ధి చేస్తున్న ప్రోగ్రామర్లకు ఒక పోటీని పెట్టడం ద్వారా వారిని గుర్తించడం, అదే సమయంలో తెలుగు వాడుకను పెంపొందించడం, సరళతరం చేయడం

*కొత్త తెలుగు ఖతులను, ఉపకరణాలను, అప్లికేషన్స్ అభివృద్ధి చేయడంలో ఆ రంగంలో పనిచేస్తున్న వారికి అవసరమైన సహాయం అందించడం

*ప్రభుత్వ ఉద్యోగులకు, రచయితలకు, విలేకరులకు, విద్యార్థులకు డిజిటల్ మాధ్యమాలలో తెలుగు వాడుకపై అవగాహనా సదస్సులను నిర్వహించడం

*ప్రభుత్వ వెబ్ సైట్లలో తెలుగు వాడకాన్ని ప్రోత్సహించడం, దశల వారీగా తప్పనిసరి చేయడం

*గూగుల్, మైక్రోసాఫ్ట్, ఫేస్ బుక్ వంటి అంతర్జాతీయ సాంకేతిక సంస్థలతో, స్వచ్ఛంద సంస్థలు, సామాజిక కార్యకర్తలతో తెలుగును డిజిటల్ మాధ్యమాలలో విస్తృతంగా వినియోగంలోకి తెచ్చే ప్రయత్నాలు చేయడం

*డిజిటల్ మీడియా విభాగం సంచాలకులు  దిలీప్ కొణతం, సహాయ సంచాలకులు మాధవ్ ముడుంబై, కూచిభొట్ల ఆనంద్, ఉమా మహేశ్వర రావు, సురేష్ కూచిభొట్ల, వీవెన్, టిఎస్ న్యూస్ టుడే చీఫ్ ఎడిటర్ ఎం.లక్ష్మయ్య నేత,వి5న్యూస్ ఎడిటర్ స్వామి ముద్దం డిజిటల్ ఇండియా టైమ్స్ ఎడిటర్ అమర్ రాజ్ పటే లతో పాటు డిజిటల్ మాధ్యమాలలో తెలుగు వాడుకపై వివిధ రంగాలలో కృషి చేస్తున్న సుమారు 60 మంది ప్రముఖులు ఈ కార్యక్రమంలో తమ అభిప్రాయాలను పంచుకున్నారు.

 

Share

Related Articles

తాజా వార్తలు

Free Live TV

షేర్ మార్కేట్

Live NSE BSE Market Charts
'