రైతు అభివృద్ధితోనే దేశాభివృద్ధి

November 30
15:37 2017

హైదరాబాద్: రైతు అభివృద్ధి చెందితేనే దేశం అభివృద్ధి చెందుతుందని తాము నమ్ముతున్నామని, ఈ మేరకు రైతులు అభివృద్ధి చెందేదిశగా కార్యక్రమాలు చేపడుతున్నామని ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు తెలిపారు. బుధవారం ప్రగతిభవన్‌లో ముఖ్యమంత్రిని నీతి ఆయోగ్ వైస్ చైర్మన్ రాజీవ్‌కుమార్, సభ్యులు రమేశ్‌చందర్ కలిశారు. ఈ సందర్భంగా రాష్ట్ర సమగ్రాభివృద్ధికి, ముఖ్యంగా వ్యవసాయాభివృద్ధికి చేపడుతున్న చర్యలను సీఎం కేసీఆర్ వారికి వివరించారు. రాష్ట్రంలో సాగునీటి వనరులను అభివృద్ధి చేస్తున్నామని, ఇప్పటికే మిషన్ కాకతీయద్వారా చెరువుల పూడిక తీశామని, ఈ కార్యక్రమం చివరిదశ కొనసాగుతున్నదని తెలిపారు. సాగునీటి ప్రాజెక్టులు భారీ ఎత్తున నిర్మిస్తున్నామన్నారు. ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా నిర్మిస్తున్న కాళేశ్వరం ప్రాజెక్టును పరిశీలించాలని సీఎం కేసీఆర్ నీతిఆయోగ్ వైస్ చైర్మన్‌ను కోరినట్టు తెలిసింది.

రైతుల ఆదాయాన్ని రెట్టింపు చేయడానికి ప్రయత్నించాలని నీతిఆయోగ్ వైస్ చైర్మన్ రాజీవ్‌కుమార్ పేర్కొన్నారు. బుధవారం మర్రిచెన్నారెడ్డి మానవవనరుల కేంద్రంలో ట్రైనీ అఖిల భారత సర్వీస్ అధికారుల శిక్షణ కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. 2022 నాటికి పేదరికం, అవినీతి, టెర్రరిజం నిర్మూలన జరిగి దేశం ప్రపంచానికే రోల్‌మోడల్‌గా నిలుస్తుందని అభిప్రాయపడ్డారు. రాజీవ్‌కుమార్‌కు ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు నిరంజన్‌రెడ్డి, కార్యదర్శి బీపీ ఆచార్య పోచంపల్లి స్టోల్ మెమొంటోను బహూకరించారు.

Related Articles

తాజా వార్తలు

Free Live TV

షేర్ మార్కేట్

Live NSE BSE Market Charts
'