దీక్షాదివస్ స్ఫూర్తిగా బంగారు తెలంగాణ

November 29
15:37 2017

దీక్షాదివస్ స్ఫూర్తితో అందరూ బంగారు తెలంగాణ సాధనలో భాగస్వాములు కావాలని ఎంపీ కల్వకుంట్ల కవిత పిలుపునిచ్చారు. నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్ మైదానంలో తెలంగాణ జాగృతి ప్రధాన కార్యదర్శి నవీనాచారి అధ్యక్షతన బుధవారం నిర్వహించిన దీక్షాదివస్ కార్యక్రమానికి ఎంపీ ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా వెయ్యి మంది ఉదయం నుంచి సాయంత్రం వరకు దీక్ష చేశారు. దీక్షాశిబిరాన్ని రాజ్యసభ సభ్యుడు డీ శ్రీనివాస్ ప్రారంభించారు. శిబిరంలో ఎంపీ కవిత మాట్లాడుతూ, 2009 నవంబర్ 29న కేసీఆర్ ఆమరణ దీక్ష చేపట్టినప్పటి పరిస్థితులను వివరించారు.

కేసీఆర్ దీక్షకు ఎంతటి ప్రాముఖ్యం ఉందో, ప్రజల మద్దతుకు కూడా అంతే ప్రాధాన్యం ఉందని అన్నారు. 2001లో టీఆర్‌ఎస్ పార్టీ ఏర్పాటు చేసినప్పడు కేసీఆర్‌ను నమ్మేందుకు ఎంతో మంది వెనుకాడారని, అయినా కేసీఆర్ ప్రతి సమస్యను తన తేలివితేటలు, సహనం, రాజకీయ నైపుణ్యంతో పరిష్కరించుకుంటూ ముందుకు సాగారని తెలిపారు. తెలంగాణ కోసం కొట్లాడే ఏకైక వ్యక్తి ఆమరణ దీక్ష చేస్తే, ఏం జరుగుతుందో ఏమోనని అందరూ భయపడ్డారని చెప్పారు. కేసీఆర్ కుటుంబ సభ్యులుగా తాము పడిన మనోవేదన వర్ణనాతీతమన్నారు. అలాంటి సందర్భం పగవాడికి కూడా రావద్దంటూ ఆమె భావోద్వేగానికి లోనయ్యారు. శ్రీకాంతాచారి ఆత్మబలిదానం వార్తలను టీవీలో చూసి కేసీఆర్ భోరున విలపించారని చెప్పారు. మన భాషను, మన యాసను ఆనాడు ఇతరులు వెక్కిరించినా ప్రత్యేక రాష్ర్టాన్ని సాధించుకుని ఈరోజు అందరూ గర్వపడేలా ప్రపంచ తెలుగు మహాసభలను నిర్వహించుకుంటున్నామని అన్నారు. ఎంపీ డీ శ్రీనివాస్ మాట్లాడుతూ, కేసీఆర్ నాయకత్వాన్ని అందరు బలపర్చాల్సిన అవసరం ఉందన్నారు. ఉద్యమంలో కేసీఆర్ దీక్షకు చాలా ప్రాధాన్యం ఉందన్నారు. ఉద్యమంలో ఇందూరుకు ప్రత్యేక స్థానం ఉందని, అదే స్ఫూర్తిని కొనసాగించాలని సాహిత్య అకాడమీ చైర్మన్ నందిని సిధారెడ్డి అన్నారు.

కేసీఆర్ దీక్ష ఫలితంగానే తెలంగాణ సాకారమైందని మిషన్ భగీరథ వైస్‌చైర్మన్, బాల్కొండ ఎమ్మెల్యే వేముల ప్రశాంత్‌రెడ్డి అన్నారు. తెలంగాణపై కాంగ్రెస్‌కు ప్రేమ లేదని, విద్యార్థుల ఆత్మబలిదానాలకు ఆ పార్టీయే కారణమని తెలిపారు. కేసీఆర్ త్యాగాన్ని తెలంగాణ ప్రజలు ఎన్నటికి మరిచిపోరని రూరల్ ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్ అన్నారు. తెలంగాణకు కేసీఆర్ గాంధీజీ లాంటి వారని, తెలంగాణ కోసం ఆయన అనేక అవమానాలు భరించారని ఆర్మూర్ ఎమ్మెల్యే ఆశన్నగారి జీవన్‌రెడ్డి చెప్పారు. కేసీఆర్ రాజకీయ చతురతతో తెలంగాణను సాధించారని అర్బన్ ఎమ్మెల్యే బిగాల గణేశ్‌గుప్తా తెలిపారు. కార్యక్రమంలో ఎమ్మెల్సీలు వీజీగౌడ్, భూపతిరెడ్డి, నగర మేయర్ ఆకుల సుజాత, జడ్పీచైర్మన్ దఫేదార్ రాజు, నెడ్‌క్యాప్ చైర్మన్ అలీ, ఉద్యోగ జేఏసీ, జాగృతి, టీఆర్‌ఎస్ నాయకులు పాల్గొన్నారు.

Tags
Share

Related Articles

తాజా వార్తలు

Free Live TV

షేర్ మార్కేట్

Live NSE BSE Market Charts
'