పల్లెపల్లెకు నేతలు

December 22
10:24 2017

సచివాలయం: ప్రభుత్వ పథకాల పట్ల దళితులకు అవగాహన కల్పించేందుకు జనవరి 27 నుంచి ఏప్రిల్ 20 వరకు 82 రోజుల పాటు పల్లెపల్లెకు నేతలు అనే కార్యక్రమం చేపట్టనున్నట్లు ఎస్సీ కోపరేటివ్ ఫైనాన్స్ కార్పోరేషన్ చైర్మన్ జూపూడి ప్రభాకర రావు చెప్పారు. సచివాలయం 4వ బ్లాక్ పబ్లిసిటీ సెల్ లో గురువారం మధ్యాహ్నం ఆయన మీడియాతో మాట్లాడారు. రాష్ట్రంలో 20 లక్షల దళిత కుటుంబాలు, కోటి మంది జనం ఉన్నారని,  ఈ కార్యక్రమంలో వారినందరినీ నేతలు కలుస్తారని చెప్పారు. బాబా సాహేబ్ అంబేద్కర్ ఆశయాలను సీఎం చంద్రబాబు నాయుడు ఆచరణలో పెడుతున్నారని, దళిత తేజం చంద్రబాబు అని అన్నారు.

ఈ కార్యక్రమంలో అంబేద్కర్ ఆశయాలను కరపత్రాలు, గోడ పత్రికలు, షార్ట్ ఫిల్మ్ ప్రదర్శనల ద్వారా ప్రచారం కల్పిస్తామన్నారు. ఏప్రిల్ 5న జగ్జీవన్ రామ్ జయంతి, 11న జ్యోతీరావు పూలే జయంతి, 14న అంబేద్కర్ జయంతి వస్తాయని చెప్పారు. 14న ప్రతి నియోజకవర్గంలో పెద్ద ఎత్తున బహిరంగ సభలు నిర్వహిస్తామన్నారు. ఏప్రిల్  20న చంద్రబాబు పుట్టిన రోజు నాడు రెండు లక్షల మంది దళితులతో భారీ బహిరంగ సభ నిర్వహించనున్నట్లు తెలిపారు. ఎస్సీ కార్పోరేషన్ ద్వారా లబ్దిపొందినవారందరూ ఇందులో పాల్గొంటారన్నారు. ఆ రోజున రాజధాని అమరావతిలో 125 అడుగుల అంబేద్కర్ విగ్రహ స్థాపనకు శంకుస్థాపన చేసే అవకాశం ఉందని తెలిపారు.

ఎస్టీ కార్పోరేషన్ నిధులతో ఎస్సీలకు 140 ఇన్నొవా వాహనాలు, ప్రొక్లెయినర్లు, వ్యాపారాలకు రుణాలు అందజేసినట్లు వివరించారు. ఈ ఏడాది మరో 200 ఇన్నొవాలు, 200 జెసిబీలు ఇవ్వనున్నట్లు చెప్పారు.  ఎస్సీలకు ఉపాధి కల్పనలో భాగంగా స్టీల్ ప్లాంట్ వంటి ప్రభుత్వ రంగ సంస్థలతో ఒప్పందం కుదుర్చుకొని స్కిల్ డెవలప్ మెంట్ అండ్ ఎంప్లాయిమెంట్ కార్యక్రమం చేపట్టనున్నట్లు ఆయన తెలిపారు.

3 రోజుల దళిత పార్లమెంట్

మహిళా పార్లమెంట్ జరిగిన విధంగా రాష్ట్రంలో 3 రోజుల పాటు దళిత పార్లమెంట్ నిర్వహించనున్నట్లు చెప్పారు. ప్రపంచ వ్యాప్తంగా అమెరికా, లండన్, దక్షిణాఫ్రికా, ఆస్ట్రేలియా వంటి దేశాలలోని  దళితులకు, దళితుల కోసం పని చేసేవారికి ఆహ్వానాలు పంపుతామన్నారు. విశాఖపట్నంలో దళిత మహిళపై జరిగిన దాడిని ఆయన ఖండించారు. ఈ సంఘటనలో ఆరుగురిని అరెస్ట్ చేసినట్లు తెలిపారు. వారిపై అట్రాసిటీ కేసు పెట్టాలని ఆయన డిమాండ్ చేశారు.

 

 

 

Share

Related Articles

తాజా వార్తలు

Free Live TV

షేర్ మార్కేట్

Live NSE BSE Market Charts
'