కృష్ణా జలాల్లో తెలంగాణ వాటా 34%

November 05
09:22 2017

హైదరాబాద్: కృష్ణా నదీ యాజమాన్య బోర్డు సమావేశంలో తెలుగు రాష్ట్రాల మధ్య కృష్ణాజలాల కేటాయింపులపై దామాషాను అనుసరిస్తూ కీలక నిర్ణయం తీసుకున్నారు. 2017-18 ఏడాదిలో ఆంధ్రప్రదేశ్ 66%, తెలంగాణ 34% జలాలను పంపిణీ చేసుకునేందుకు రెండు రాష్ర్టాల మధ్య అంగీకారం కుదిరింది. శనివారం జలసౌధలో బోర్డు చైర్మన్ శ్రీవాత్సవ అధ్యక్షతన మధ్యాహ్నం మూడు గంటల నుంచి రాత్రి 8.30 గంటల వరకు సుదీర్ఘభేటీ జరిగింది. ఉమ్మడి ఏపీకి బచావత్ కేటాయించిన 811 టీఎంసీల్లో రెండు రాష్ర్టాల తాత్కాలిక ఒప్పందం ప్రకారం దామాషా పద్ధతిన ఏపీ 512 టీఎంసీలు (63 శాతం) తెలంగాణ 299 టీఎంసీలు (37 శాతం) ఇప్పటివరకు తీసుకున్నాయి.

తెలంగాణకు చిన్న నీటివనరుల కింద బచావత్‌లో పేర్కొన్న 89 టీఎంసీలను పరిగణనలోనికి తీసుకోవాలని, 70: 30 శాతంతో పంపిణీ జరుగాలని ఏపీ పట్టుబట్టింది. చెరువుల కింద వినియోగం పెద్దగా లేదని వాదించిన తెలంగాణ అధికారులు 70:30 శాతానికి అంగీకరించేదిలేదని స్పష్టంచేశారు. దీంతో చివరకు ఏపీ 66 శాతం, తెలంగాణ 34 శాతం పంపిణీకి అంగీకారం కుదిరింది. పైగా ఆంధ్రప్రదేశ్‌కు సంబంధించి తుంగభద్ర నీటి వినియోగాన్ని పరిగణనలోనికి తీసుకోనుండటం తెలంగాణకు అనుకూలించే పరిణామం. తుంగభద్ర, జూరాల, శ్రీశైలం, నాగార్జునసాగర్, పులిచింతల జలాశయాల్లో గత నెల 31 వరకు 330 టీఎంసీల నీటిలభ్యత ఉన్నట్టు గుర్తించారు. ఇప్పటివరకు ఏపీ 107 టీఎంసీలు, తెలంగాణ 50 టీఎంసీలు వాడుకున్నందున తెలంగాణ 115.92 టీఎంసీలు, ఏపీ 215.08 టీఎంసీలు వాడుకోవచ్చు.

Related Articles

తాజా వార్తలు

Free Live TV

షేర్ మార్కేట్

Live NSE BSE Market Charts
'