తెలంగాణలో రసస్ఫూర్తికి కొదువ లేదు

December 17
16:30 2017

హైదరాబాద్‌: తెలంగాణలో రస స్ఫూర్తికి కొదువ లేదని సీఎం కేసీఆర్‌ అన్నారు.  ప్రపంచ తెలుగు మహాసభల సందర్భంగా సారస్వత పరిషత్‌ భవనంలో ఆదివారం శతావధానం జరిగింది. ఈ కార్యక్రమంలో సీఎం పాల్గొని అవధాని రామశర్మను సన్మానించారు. తెలుగు భాషాభివృద్ధికి కృషి చేస్తామని చెప్పారు. తెలుగు భాషా ప్రియులకు మేలు చేసేలా మహా సభల ముగింపులో మంచి ప్రకటన చేస్తామని కేసీఆర్‌ వెల్లడించారు.

తెలంగాణ సారస్వత పరిషత్‌లో అవధాని జీఎం రామశర్మచే నిర్వహించబడిన శతావధానం కార్యక్రమంలో ముఖ్యమంత్రి కేసీఆర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా అవధాని రామశర్మ.. తెలంగాణ ప్రభుత్వ సంక్షేమ పథకాలను పద్యరూపంలో అద్భుతంగా వర్ణించారు. అనంతరం రామశర్మను సీఎం కేసీఆర్ శాలువాతో సత్కరించి సన్మానించారు.

అనంతరం సీఎం కేసీఆర్ మాట్లాడుతూ.. ప్రపంచ తెలుగు మహాసభలకు 42 దేశాలు, 17 రాష్ర్టాలు, ఒక కేంద్రపాలిత ప్రాంతం నుంచి ప్రతినిధులు తరలివచ్చారని తెలిపారు. రవీంద్రభారతి, తెలుగు విశ్వవిద్యాలయం, ఇందిరా ప్రియదర్శిని ఆడిటోరియం, సారస్వత పరిషత్ వేదికల్లో చోటు సరిపోలేనంత సాహితీప్రియులు హాజరు కావడం సంతోషంగా ఉందన్నారు సీఎం. సాహితీప్రియుల సహకారం వల్ల తెలుగు మహాసభలు ఘనంగా జరుపుకుంటున్నామని సీఎం పేర్కొన్నారు. సభల ముగింపు రోజున చరిత్రాత్మకమైన నిర్ణయాలు వెల్లడిస్తామని కేసీఆర్ చెప్పారు. ప్రపంచ వ్యాప్తంగా ఉన్న తెలుగువారు హర్షించేలా తీర్మానాలు ప్రకటిస్తామని సీఎం తెలిపారు.

ప్రపంచ తెలుగు మహాసభల ద్వారా సాహిత్యానికి పూర్వ వైభవం వస్తుందన్నారు. కవి సమ్మేళనాలు, చర్చలు చాలా ఆసక్తికరంగా సాగుతున్నాయని తెలిపారు. సభ నిర్వహణ, అతిథులకు భోజన సదుపాయం కూడా బాగున్నాయని చెప్పారు. ఈ మధ్య కాలంలో సాహితీవేత్తలకు కాస్త ఆదరణ తగ్గిందన్నారు. ఇకపై అలాంటి పరిస్థితి ఉండదు.. సాహితీవేత్తలకు తగిన గుర్తింపు దక్కుతుందని సీఎం స్పష్టం చేశారు. తెలంగాణలో రసస్ఫూర్తికి కొదవలేదన్నారు.

Related Articles

తాజా వార్తలు

Free Live TV

షేర్ మార్కేట్

Live NSE BSE Market Charts
'